Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lolakulu
Kurra Bewarse
Username: Lolakulu

Post Number: 1434
Registered: 05-2017
Posted From: 24.183.83.206

Rating: N/A
Votes: 0

Posted on Friday, May 29, 2020 - 9:59 am:   

రామారావు కి తన అభిమాన నటుడు, తెలుగు చలన చిత్రరంగంలో ఏకైక గిగా స్టార్‌ , సంజీవి కెనడా వస్తున్నాడని తెలిసినప్పటి నుంచీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కెనడా తెలుగు అసోసియేషన్‌ వాళ్ళ దశ వార్షికోత్సవాలకి తన అభిమాన గిగా స్టార్‌ రావడం ఆ తెలుగు సంస్థ అదృష్టం గా కాకుండా తన అదృష్టంగా భావించాడు రామా రావు.
సంజీవి సినిమా రిలీజు అయితే, మొదటి రోజు, మొదటి ఆటకి వెళ్ళాల్సిందే !

ఒకవేళ కాలేజీ ఉంటే, క్లాసులెగ్గొట్టి మరీ వెళ్ళే వాడు. తన అభిమాన హీరో నటించిన అన్ని సినిమాలు ఒక్కొక్కటి కనీసం ఓ ఇరవై సార్లయినా చూసి వుంటాడు.
అదే హిట్టయిన సినిమా అయితే ఇక చెప్పనవసరం లేదు ఓ వంద సార్లయినా చూసుంటాడు.

ఇండియాలో ఉన్నన్నాళ్ళూ, తన అభిమాన హీరో దర్శనమే కాలేదు. ఆ తరువాత చదువుల కోసం కెనడా రావడం, అక్కడే స్థిరపడిపోవడం తో తన అభిమాన హీరోని సశరీరంగా కళ్ళారా చూసుకునే భాగ్యం ఇన్నాళ్ళవరకు కలగలేదు.
అడపా దడపా, సంజీవి సినిమాలు మాత్రం వదలకుండా చూస్తాడు.

రామారావు భార్య హరిత అదే అంటుంది, ” ఈ పళంగా మీ అభిమాన హీరో నాకు విడాకులిచ్చేయమంటే, మీరు ఓ క్షణం కూడా ఆలోచించరు మీ హీరో అంటే మీకు అంత పిచ్చి !”.
ఓ సారి, హరిత “సంజీవి” నటన బాగాలేదంటే, ఓ నెళ్ళాళ్ళు రామారావు హరితతో మాట్లాడడం మానేశాడు.
అప్పట్నుండి, హరిత రామారావు ఎదురుగా, “సంజీవి” ని ఒక్క మాట కూడా అనదు.
రామారావు “సంజీవి ” కి విదేశాలలో చిక్కుకుపోయిన వీరాభిమాని.

తన అభిమాన నటుడి రాక తెలిసినప్పటినుండి, రామారావు తెలుగు సంఘం వాళ్ళని ఓ పది సార్లయినా కలిసాడు, కెనడాలో ఆయన జైత్రయాత్రావివరాల కోసం.
ఆ తెలుగు సంఘం వాళ్ళు ఈ వార్షికోత్సవానికి భారీ టిక్కట్లు పెట్టారు. రామారావు తన హీరోని దగ్గరగా చూడాలని, అన్నిటికంటే ఖరీదయిన టిక్కట్టు కొన్నాడు.
అంతే కాదు “గిగా స్టార్‌ తో విందు” అంటూ ఓ వెయ్యి డాలర్ల టిక్కట్టు పెడితే, రామారావు మొట్టమొదటి టిక్కట్టు కొన్నాడు.
ఆహా ! తన చిరకాలపు కోరిక తీరుతోందని సంబర పడ్డాడు.

దశ వార్షికోత్సవాల తేదీ ఎప్పుడొస్తుందా అని , ఆ తెలుగు సంఘం కంటే రామారావే ఎదురుచూసాడు.
కాని గిగా స్టార్‌ గారు రాక పోవచ్చు అనే వదంతులు, వార్తలు రావడంతో రామారావు నీరుకారిపోయాడు.
చివరకి ఎలాగైతేనే రామారావు అదృష్టం బాగుండి, సంజీవి వస్తున్నాడన్నారు.
ఆ రోజు రానే వచ్చింది. గిగా స్టార్‌ సంజీవి రానే వచ్చాడు.
తెలుగు సంస్థ వారు మొదటి రోజు సాయంత్రం, ఆంధ్రుల అభిమాన నటుడు, గిగా స్టార్‌ కి వజ్రకిరీటంతో సన్మానం ఏర్పాటుచేశారు.

ఆ సాయంత్రం ప్రోగ్రాం మొదలయ్యింది.
ఇసుకవేస్తే రాలనంత జనం.
అమెరికా నుండి కూడ గిగా స్టార్‌ అభిమానులు తండోపతండాలుగా వచ్చారు.
ఇంకా గిగా స్టార్‌ గారి సన్మానానికి ఓ గంట టైముంది.
రామారావు, మొత్తానికెలాగో తెలుగు సంఘం వాళ్ళ సహాయంతో గిగా స్టార్‌, వారి బృందం బస చేసిన హొటల్‌ కి వెళ్ళాడు.

వెళ్ళేసరికి, గిగా స్టార్‌ రూంలో పెద్దగా గొడవ జరుగుతోంది.
రామారావు దూరం గా నుంచుని చూస్తున్నాడు.
సంజీవి గట్టి గా తెలుగులో, మరుగున పడిపోతున్న అశ్లీల పదజాలాన్ని అంతటినీ తిరగదోడి తెలుగు సంఘం ఆర్గనైజర్‌ మీద అమాంతంగా కుమ్మరిస్తున్నాడు.
” ఒక 50 లక్షల రూపాయిలైనా ఇవ్వకుండా ఎందుకు పిలుస్తారండి. మాకేం పనీ పాటా లేదను కున్నారా. మాకు ప్రతీ నిమిషం ఓ వంద డాలర్లతో సమానం. మీరు కనీసం ఓ 25 లక్షలైనా ఇవ్వక పోతే, నేను స్టేజి మీదకి రాను. మీరేం చేసు కుంటారో మీ ఇష్టం. రేపు ప్రోగ్రాం కూడా కాన్సిల్‌ ” బెదిరించాడు సంజీవి.
” అలాగంటే ఎలాగ సార్‌ ! మీకు సన్మానం లో భాగంగా, ఆ వజ్ర కిరీటం ఖరీదే 20 లక్షలైంది. ఇంకా మీకు వేరే ఇమ్మంటే కష్టమండి. అయినా మేము ముందుగా మీరు వస్తే డబ్బు ఇస్తామని చెప్పలేదు కదండి. అసలు ఈ విషయం మీ సెక్రటరీ కాని, మీరు కాని చెప్పలేదు. ఇప్పుడు రామూ అంటే, మా తెలుగు సంఘం పేరు పోతుందండి. ఇంత క్రౌడ్‌ని ఎలా కంట్రోల్‌ చెయ్యడం ? ” ప్రార్థించాడు తెలుగు సంఘం ప్రెసిడెన్ట్‌ .
” మీ పేరు ఎవడికి కావాలండి ? మా పేరు చూసి వస్తారు ఈ జనం. టిక్కట్లు బాగనే అమ్మేరు కదా, ఆ మనీ ఇవ్వండి. లేకపోతే ప్రోగ్రాం కాన్సిల్‌ . ” మరోసారి విసుగ్గా అన్నాడు గిగా స్టార్‌ !

నోటికొచ్చిన తిట్లతో తెలుగు సంఘం ప్రెసిడెన్ట్‌ని చెడా మడా తిట్టాడు గిగా స్టార్‌ . అవాక్కయి చూస్తూ నిలబడ్డాడు రామారావు.
మొత్తానికి చుట్టుపక్కల వున్న వాళ్ళు అందరూ సర్ది చెప్పేక అలాగే వస్తానని ఒప్పుకున్నాడు గిగా స్టార్‌ .
తెలుగు సంఘం ప్రెసిడెన్టేకాదు, రామారావు కూడా ఊపిరి పీల్చుకున్నాడు.
ఇదంతా చూస్తే రామారావు కి తలతిరిగి నట్లయ్యింది.
తన అభిమాన నటుడి నిజ జీవిత ప్రవర్తన చూసేక ఇతన్నేనా తను ఇంతకాలం ఆరాధించింది? అనిపించింది.
మొత్తానికి అరగంట ఆలస్యంగా గిగా స్టార్‌ స్టేజి మీదకి వచ్చాడు.
రావడం మామూలుగా రాలేదు తూలుతూ ఇంకొకరి సాయంతో డైయాస్‌ దగ్గరకి వచ్చాడు.
“ప్రియమైన నా అభిమానుల్లారా !” అంటూ ముద్దమాటలతో మొదలెట్టాడు. తమ అభిమాన నటుడి ఈ సంబోధన వినేసరికి అందరూ నిశ్చేష్టులయ్యారు.
” నాకు ఈ దేశం బాగా నచ్చింది. ముఖ్యంగా ఇక్కడమ్మాయిలు మన తెలుగు హీరోయిన్‌ ల కన్నా అందంగా ఉన్నారు. నా తదుపరిచిత్రంలోకి ఈ దేశపు తెలుగమ్మాయినే హీరోయిన్‌ గా తీసుకుంటానని సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నా. అంతేకాదు, పదేళ్ళ క్రితం నేను నిర్మించిన చిత్రాన్ని ఈ తెలుగు వాళ్ళకి అంకితం ఇస్తున్నాను. ఇంకా ఇండియాలో నా అభిమాన సంఘం వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలకి మీరందరూ విరాళాలు ఇవ్వండి. మీరు ఇక్కడ బాగానే సంపాదిస్తారు. మీరందరూ ఇండియాలో వాళ్ళకి నా అభిమాన సంఘం ద్వారా సహాయం చేయండి……..” ఇలా సాగుతున్న ఉపన్యాసం పూర్తవ్వకుండానే గిగా స్టార్‌ తూలుతూ కింద పడ్డాడు. గబ గబా స్టేజి వెనుక నుండి ఎవరో వచ్చి తీసుకెళ్ళారు. జనంలో ఒక్కసారి కలకలం మొదలయ్యింది.
ఇంతలో ఎవరో స్టేజి మీదకి వచ్చి
“అందరూ దయచేసి కూర్చోండి. గత రెండు రోజులుగా మన గిగా స్టార్‌ గారికి జ్వరం గా ఉంది. అయినా సరే మన తెలుగు వాళ్ళంటే అభిమానం కొద్దీ, జ్వరం కూడా లెఖ్ఖ చేయకుండా మిమ్మల్ని ఆనందింప చేసారు. ఎక్కువ నీరసంగా ఉండడం వల్ల నిల్చో లేక పోయారు…దయచేసి మీరందరూ సహకరించండి…” అంటూ ఇంగ్లీషు లో వివరించారు.

జనం అందరూ కాస్త సద్దుకున్నారు.
ఇదంతా చూస్తుంటే రామారావుకి మతిపోయింది.
ఇతనేనా మీ హీరో అన్నట్లుగా రామారావు భార్య అతనికేసి చూసేసరికి రామారావుకి తలకొట్టేసినట్లయ్యింది.
ఇలాంటి హీరోనా ఇన్నాళ్ళూ ఆరాధించింది ? క్లాసులెగ్గొట్టి మరీ సినిమాలు చూసింది ? తన అభిమాన హీరోని విమర్శించిన హరిత మీద తను చాలా సార్లు కోప్పడింది ? ఇవన్నీ తలుచుకుంటే రామారావుకి తన ప్రవర్తనకి సిగ్గేసింది.

ప్రోగాం అయిపోయాక బయటకు వస్తూంటే, రామారావు స్నేహితుడు , కిరణ్‌ కనిపించాడు.
రామారావు తన అభిమాన హీరో తో జరిగిన సంఘటన గురించి చెప్పాడు.
” ఇది చాల చిన్న విషయం నీకు తెలియనిది ఇంకో విషయం చెబుతా”నంటూ, “ఈ గిగా స్టార్‌ ఇక్కడ ఒక కెనడా అమ్మాయి చెయ్యి పట్టుకుని అసభ్యం గా ప్రవర్తించబోతే ఆ అమ్మాయి పోలీసులని కాల్‌ చేసిందట.
మొత్తానికి ఈ తెలుగు సంఘం వాళ్ళు కింద మీదా పడి ఆ గొడవ తప్పించారు. అయినా ఇంత పెద్ద సెలబ్రిటీస్‌ కి పదిమంది లో ఎలా మసలాలో తెలియదు.. వాళ్ళ దృష్టిలో ప్రజలు గొర్రెల మంద వాళ్ళేమి చేసినా చెల్లుతుందనే అహంకారం…అయినా వాళ్ళనని ఏం ప్రయోజనం ? మనలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ వెనక పడుతూంటే అలాగే ఉంటారు ..” కిరణ్‌ ఆవేశంగా చెప్పాడు.
రామారావు కి చెళ్ళున కొట్టినట్లయ్యింది.
ఇంటికొస్తుంటే, కారులో ఉండగా, హరిత రామారావు మౌనం చూసి అంది.
” ఏం ? మీ హీరో గారు మీకు చిన్న జర్క్‌ ఇచ్చారా ? మీ హీరో గార్ని చూస్తే అందరికీ అసహ్యం వేసింది. ఇంత ఖర్చు పెట్టి తీసుకొస్తే, కనీసం ఈ ప్రేక్షకుల ముందు ఎలా ప్రవర్తించాలో తెలియని ఇండీసెంట్‌ ఫెల్లోస్‌ ఇలాటి వాళ్ళ ప్రోగ్రాంస్‌ అంటూ ఎగ పడి పోయేవాళ్ళననాలి మనం ఇక్కడ బాగ సంపాదిస్తాముట మనకి ఊరికే ఎవరూ డబ్బు ఇవ్వరు. అయినా ఈ గిగా స్టార్లు ప్రతీ సినిమాకి కోట్లు కోట్లు పారితోషికం తీసుకుంటారుగా, అంతగా పేద ప్రజలకి సహాయం చేయాలంటే, తన ఒక సినిమా పారితోషికం విరాళంగా ఇవ్వచ్చు కదా ? వాళ్ళ డబ్బు మాత్రం పదిలం మనం మాత్రం ప్రజా సేవ చేయాలీ ? ”
రామారావు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వింటున్నాడు ఇన్నాళ్ళు హరిత అణచుకున్న కోపం బయటకి రావడాన్ని చూస్తూ….

ఆ మర్నాడు ఇన్టెర్నెట్‌ ఎడిషన్‌ తెలుగు పేపర్లో వార్త
” ప్రవాసాంధ్రులను సమ్మోహన పరచిన గిగా స్టార్‌ ! గిగా స్టార్‌ ప్రదర్శనకి మంత్రముగ్ధులైన ప్రవాసాంధ్రులు ! మూడుగంటల పాటు ప్రవాసాంధ్రులని కట్టి పడేసిన గిగా స్టార్‌ నటనా చాతుర్యం…”
ఈ వార్తలన్ని చదివి ప్రవాసాంధ్రులకి మతిపోయింది, రామారావు కి కూడా.
” ఈ పత్రిక ప్రజల పత్రిక నిష్పక్షపాత వార్తలకి పుట్టినిల్లు” ఆ పత్రిక లోగో కింద పెద్ద పెద్ద అక్షరాలు రామారావుని మరొక్కసారి వెక్కిరించాయి.
దెబ్బతిన్న అభిమానంతో, రగులుతున్న అవమానంతో ఆ రాత్రి రామారావుకు నిద్రపట్టలేదు. జాగారమే అయింది.
తెలతెలవారుతుండగా ఓ ఘోరమైన నిర్ణయానికి వచ్చాడతను.
పొద్దున్నే గుడికెళ్ళి శాస్త్రోక్తంగా గిగాస్టార్‌ అభిమానానికి తిలోదకాలు ఇచ్చేశాడు.
పన్లో పనిగా వర్ధమాన టెరా స్టార్‌ జూనియర్‌ లంబోదర్‌కి అభిమానసంఘం స్థాపించి తనే దానికి ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేశాడు!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration