Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Abhimaani
Pilla Bewarse
Username: Abhimaani

Post Number: 139
Registered: 03-2005
Posted From: 183.83.72.142

Rating: N/A
Votes: 0

Posted on Thursday, May 28, 2020 - 1:33 pm:   

వేటూరి సుందర్రామ్మూర్తి గారి "కొమ్మకొమ్మకో సన్నాయి" నుండి CLIPART--happy -

1951వ సంవత్సరం. మల్లీశ్వరి, పెళ్ళి చేసి చూడు చిత్రాలు తెలుగు కళ్ళకు చల్లగా, తెలుగు సినిమా కళామతల్లి కడుపు చల్లగా విడుదలై, ఆంధ్ర, ఆంధ్రేతర ప్రేక్షక రసికులని ఉర్రూతలూగించిన వేళ. ఒకనాటి సాయంత్రం. మద్రాసు ఆంధ్ర విద్యార్ధి విజ్ఞాన సమితి పచ్చయప్ప కళాశాలలో శ్రీ బి.యన్.రెడ్డి గారికి సన్మానం చేసింది. అన్ని కాలేజీల నుంచి తెలుగు విద్యార్ధులు, తమిళులు కూడా తరలి వచ్చారు. ఆ సభకు నడిచి వచ్చిన నాజూకు నలకూబరుడు నందమూరి తారక రాముడు. అతని ఉంగరాల జుట్టు, జరీపంచెకట్టు, స్లిమ్మ్ గా చిరునవ్వులా అతను కదిలి వచ్చిన కనికట్టు - ఇప్పుడు మళ్ళీ చూస్తున్నంత అనుభూతిని గుండెకు హత్తిపోతుంది.

ఆ సభలో నటి, నాయకి జి.వరలక్ష్మి చేసిన ప్రసంగం మరపురాదు. అప్పుడు మెహబూబ్ ఖాన్ చిత్రం 'ఆణ్ మద్రాసులో విడుదలై సంచలనం సృష్టించింది. ఆయనకు ఘనంగా హోటల్ కన్నెమెరాలో సన్మానం జరిగింది. ఆ సభలో ప్రవేశిస్తూనే మెహబూబ్ ఖాన్ ' వేర్ ఈజ్ మిస్టర్ బి.యన్ ' అని అడుగుతూ సరాసరి వచ్చి బి.యన్.రెడ్డి గారిని కౌగిలించుకున్నాడట. ఇంతమంది వివిధ భాషా చిత్రాల అతిరథ, మహారథులుండగా ఒక తెలుగు దర్శకుణ్ణి ఇంతగా ఆరాధించిన మెహబూబ్ ఖాన్ చర్యకు ' నివ్వెరపోయి నేను ప్రకాశరావు మొహం చూశాను. ప్రకాశరావు నా మొహం చూశాడు ' అని వరలక్ష్మి అన్నప్పుడు సభంతా నవ్వులు పండిపోయాయి. చిరునవ్వులాంటి నలకూబరుడూ నవ్వాడు.

ఆనాటి నుంచీ నందమూరి చందమామ వెన్నెల నవ్వు వృద్ధి క్షయాలు లేకుండా ఎదగడం మొదలుపెట్టింది. తెలుగు తెరమీద స్వతస్సిధ్ధమైన, సకల రూపక శక్తి గల, వ్యక్తిగల కళాకారుడు శ్రీ ఎన్.టి.రామారావు తరువాతగానీ, ముందుగానీ లేరు. ఆయన నిజంగా రూపసుందరుడు.

కాలేజీ విద్యార్ధిగా ఆయన తెలుగు మీద ప్రాణాలు నిలిపి తన గురువు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిని సేవించాడు. ఆయన మాటలు, పద్యాలు, ప్రవర్తనా ధోరణులు, వ్యక్తిత్వంలో వున్న విలక్షణ లక్షణాలు ఆరాధించాడు. తొలిసారి ముఖానికి రంగుపూసుకున్నది ఆయన ఆదేశం మీదనే. అదీ విజయవాడ కాలేజీ రంగస్థల వేదిక మీద. ' రాచమల్లుని యుద్ధ శాసనం ' అన్న నాటికలో నాగమ్మ పాత్ర! పైగా స్త్రీ వేషం!

రామారావుగారి విద్యార్ధి జీవితంలోఆయనను తీర్చిదిద్దినదీ తెలుగుతనమే. రాయప్రోలు, విశ్వనాథ, గరిమెళ్ళ, జాషువా, కరుణశ్రీ వంటి కవుల రచనల వల్ల ఉత్తేజితమైనది ఆయన వ్యక్తిత్వం. తుదిశ్వాస విడిచే వరకు రామారావుగారిలో ఉచ్చ్వాస నిశ్వాసాలుగా డోలలూగింది ఈ ఆంధ్రాభిమానమే. ఆ విషయంలో ఆయన సార్ధకజన్ముడై ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రాణప్రతిష్ట చేశాడు.

1950 నుంచీ మూడు దశాబ్దాల తెలుగు యువత తనను తాను ఎన్.టి.ఆర్ అనే నిలువుటద్దంలో చూసుకుని సొబగులు దిద్దుకుంది. ఆయన చిరునవ్వులు, కనుగీటులు, వస్త్రధారణలు వగైరాలలో అనేక మంది యువకు(మారు)లు, అపర ఎన్.టి.ఆర్ లై సాక్షాత్కరించేవారు.

తెలుగు చదువు, సంస్కారం అనే ద్విగుణీకృత సులక్షణ రేఖను దాటలేదు కాబట్టే ఆయన పౌరాణిక చిత్ర నట, దర్శక, నిర్మాతగా రాణించాడు. చారిత్రక చిత్రాల (తెనాలి రామకృష్ణ, మహామంత్రి తిమ్మరుసు వగైరా) లో రాజిల్లాడు. రామ రావణులు, కృష్ణార్జునులు, శ్రీనాథ వీరబ్రహ్మేంద్రలు ఏ పాత్రలు ధరించినా అన్నిటికీ అచ్చుగుద్దినట్లు అచ్చివచ్చిన రూప సౌష్టవం ఆయనలో ఉంది. సంప్రదాయ గౌరవం క్రమసిక్షణగా వర్ధిల్లింది గనుకనే కొన్ని పవిత్ర పాత్రలు ధరించేటప్పుడు ఆహార విహారాలలో నియమనిష్టలు ఆయన తు.చ. తప్పక పాటించారు. తెలుగువారి అధునాతన సినీ కళాచరిత్రకు ఆయన నాయకుడైనా, తరువాత రాజకీయంగా నాయకుడైనా ఆ నియమనిష్టలే కారణమని, అవి ఆయనకు ప్రజాహృదయాలలో సంపాదించి పెట్టిన స్థానమే మూలమని చెప్పక తప్పదు.

చాలామందికి ఆయన మంచి గాయకుడని తెలియదు. ఎంకిపాటలు, విశ్వనాథ వారి పద్యాలు రాగయుక్తంగా పాడగల దిట్ట. ఘంటసాల గారంటే ఆయనకు ప్రాణం. ఘంటసాల గారు పరమపదించినప్పుడు ఆయన ఎంత వెలితి అనుభవించారో నాకు తెలుసు.

ఆంధ్రసచిత్ర వారపత్రికలో నేను సబ్-ఎడిటర్ గా వున్న (1958-1962) రోజులలో శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు ఒకసారి నన్ను రామారావు గారికి పునః పరిచయం చేశారు. ఏ ఊరు అంటే "మాది పెదకళ్ళేపల్లి" అనగానే "మా పెదకళ్ళేపల్లి - మా తిరణాల కళ్ళేపల్లి....మరి చెప్పరేం" అని నన్ను మలి పరిచయంలోనే అభిమానించారు ఆయన. తొలి పరిచయం తరువాత కాలం జరిగి, కలవడం జరగక, మలి పరిచయం చేయక తప్పలేదు.

"మన దేశం" చిత్రంలో నటుడిగా ఆయన అవతరించేవేళ దర్శకులు ప్రసాద్ గారి పనుపున రామారావుగారిని మద్రాసు తీసుకువచ్చి తనతోపాటు ఆశ్రయమిచ్చినవారు శ్రీ దుగ్గిరాల వెంకటసుబ్రహ్మణ్యంగారు. ఆయన అప్పటికే పేరు మోసిన నిశ్చలన ఛాయా చిత్రకారుడు. డి.వి.ఎస్.మణ్యంగా ఆయన ప్రసిద్ధుడు. నెం.1, లోడీఖాన్ వీధి (త్యాగరాయ నగర్) లో మణ్యంగారితో రామారావుగారు ఉండడం నాకు తెలుసు. తరువాత ఆయన షావుకారు, పాతాళభైరవి చిత్రాలలో నటించి వేరుగా వుంటూ మణ్యంగారి దగ్గరకు తీరిక సమయాలలో వచ్చి చిలిపి చిరుతిళ్ళు, వంటలపై మక్కువ చూపించడమూ తెలుసు. ఆ సమయంలోనే ఒకసారి విక్టోరియా పబ్లిక్ హాల్ (చెన్నపురి ఆంధ్ర మహాసభ) లో తను వేయదలుచుకున్న నాటకానికి ఆంధ్ర పౌరుషం మీద ఒక గీతం కావలసి రావడం, మణ్యంగారు నన్నాయనకు అప్పగించడం జరిగింది. అన్నీ జరిగాయి కానీ నాటకం వెయ్యలేదు. కారణాంతరాల వల్ల ఆగిపోయింది. అంతకుముందే రాయలసీమ కరువునిధి కోసం ఆయన జి.వరలక్ష్మితో కలిసి ఊరూరా తిరిగి నాటకాలు ప్రదర్శించడం జరిగింది. ఎం.ఎస్.రామారావుగారు అప్పుడు ఎన్.టీ.ఆర్ కు నేపథ్యగానం చేసారు.

"రాయలు ఏలిన ఆదేశంలో
రతనాల్ పండిన ఆ భూముల్లో
కరువు పిశాచం గజ్జెకట్టుకొని
కదననృత్యం చేస్తుంటే...
వినండి బాబూ విషాద గాధ
వినరయ్యా ఈ కరువుకథ..."

ఇలాంటి పాటలతో ఆనాడు రాష్ట్రం మారుమ్రోగిపోయింది.

ఇదంతా చెప్పడానికి కారణం రామారావు గారికి మొదటి నుంచీ రాష్ట్రాభిమానం, దేశభక్తి ఉండేవని, అవి ఏనాడూ మరువనందువల్లనే ప్రజానాయకుడుగా ఎదిగాడని తెలుపడానికే. "కళ కళ కోసం కాదు - దేశం కోసం" అన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం. జీవితంలో ఆయన అది నిరూపించుకున్నారు.

ఆ రోజుల్లో ఒకసారి ఆయన తెనాలి తాలూకా కొల్లూరు వచ్చారు. కొల్లూరు మా అమ్మగారి వూరు. అక్కడి హైస్కూల్లో నేను ఎస్.ఎస్.ఎల్.సి చదివాను. అదే స్కూల్లో గుమ్మడిగారు నాకు సీనియర్. ఒకసారి గుమ్మడి తనతో రామారావుగారిని మా వూరుకు తీసుకువచ్చారు. స్వర్గీయ చెరువు ఆంజనేయ శాస్త్రి ఇంట్లో విందు. అది మరపురాని ఘట్టం. అప్పటికి నేను విజయవాడలో బి.ఏ చదువుతున్నాను. విశ్వనాథ సత్యనారాయణగారి ప్రసక్తి వచ్చింది. "ఆయనది అమోఘమైన ప్రభావం - అందులో పడ్డవారు తప్పించుకోవడం కష్టం...ఏమంటారు?" అని రామారావు నన్ను అడిగారు. "నిజమేనండీ మీలోనూ ఆయనే కనిపిస్తున్నారు - మీ సాహిత్యాభిమానం చూస్తుంటే" అన్నాను నేను. "మనమంతా తెలుగు వాళ్ళమై పుట్టినందుకు గర్వించాలి - తెలుగునే దేశ రాజభాషగా చెయ్యాలి. భారతీయుల్లో ఎక్కువమంది మాట్లాడేది తెలుగే" అన్నారు.

ఆంధ్రాభిమానం ఆయనలో ఆయనతోపాటు పెరుగుతూ వచ్చింది. ఆయన తీసిన చిత్రాలలో కూడా అది చోటు చేసుకుంది.

ఆ తరువాత ఆంధ్ర సచిత్రవారపత్రికలో సినిమా సెక్షన్ చూస్తున్నప్పుడు "నయనానంద తారక రాముని కథ" అని నేను రాసిన వ్యాసం ఆయన చదివి, ఎంతో సంతోషించి, "మీ శైలి, రచనా సౌందర్యం చూస్తుంటే మీరు సినిమా ఫీల్డ్ కి రావడం మంచిదనిపిస్తోంది" అన్నారు.

ఎన్.ఏ.టి. వారు నిర్మించిన "సీతారామ కళ్యాణం" చిత్రం పై ఘాటుగా నేను "రామారావణీయం సీతారామ కళ్యాణం" అనే శీర్షికతో రాసిన సమీక్ష చూసి చిరునవ్వుతో, ఎవరి గురించో రాసినట్టుగా, "కొంచెం ఘాటు తగ్గిస్తే బావుండేదేమో" అన్న సహృదయశీలి ఆయన. అటు తర్వాత కొన్ని పౌరాణిక గాధల విషయంలో ప్రబంధాల విషయంలో మా మధ్య ఇష్టాగోష్ఠిగా చర్చలు జరిగేవి. పింగళి సూరన గారి "కళా పూర్ణోదయం" ప్రముఖంగా చర్చకు వచ్చినా ఒక కథగా జన బాహుళ్యానికి చిరపరిచితమైన పాత్రలు లేకపోవడం అడ్డంకిగా ఆయన భావించేవారు. నిజానికి అటువంటి ప్రయత్నాలు "వరూధిని" వంటివి అపజయం పొందాయి కూడా.

తరువాత కొన్నాళ్లకు నా సంగీత నాటిక "సిరికాకొలను చిన్నది" చిత్రంగా తీయాలని ఆయన భావించినప్పుడు కధాబలం వల్ల అపరిచిత పాత్రలతో ఇబ్బంది వుండదని, శ్రీకృష్ణదేవరాయల పాత్రత వల్ల అవన్నీ సమసి పోతాయనీ, కనుక రాయల పాత్రకు శృంగారం పెంచి, మరింత ఆకర్షణీయంగా చేయమని నన్ను ఆయన కోరారు. కానీ అలా చేయడం వల్ల రాయల పాత్రకు అన్యాయం జరగడమే గాక, కథాలక్ష్యమే దెబ్బ తింటుందని భావించి ఆ విషయమే చెప్పాను. నా మాట ఆయనకు రుచించలేదు. "రాయలు పాత్ర నేనే చేస్తాను. రొమాన్స్ పెంచకపోతే బాగుండదు. మరేం పర్వాలేదు. అలా చేయండి" అన్నా అది నేను చేయలేక పోయాను. అందుకే మా చిన్నది సిరిగా సిరికాకొలనులోనే వుండిపోయింది. వెండితెర వెలుగు కాలేదు, అందుకు నాకు బాధలేదు.

నన్ను ఒక మిత్రుడిగా, ఆయన కన్న చిన్నవాడినైనా, ఎంతో అభిమానించి గౌరవించారు రామారావు. పత్రిక ఉద్యోగం మానుకున్న తరువాత "ఇక పత్రికలు వద్దు. ఫీల్డ్ లోకి వచ్చెయ్యండి" అని డి.బి.నారాయణగారి "పెండ్లిపిలుపు" చిత్రానికి సహరచయితగా చేశారు. దానికి ఇద్దరు ముగ్గురు డైలాగు రైటర్సు ఆత్రేయ, ఆరుద్ర, సముద్రాల జూనియర్. ఒకరి తరువాత ఒకరు వస్తూ, రాస్తూ - ఇలా జరిగేది ఆ పని! అవన్నీ చూసి నిర్మాత నారాయణ గారికి, దర్శకులు అమంచర్ల శేషగిరిరావుకీ వివరించడం నా పని. మధ్యేమార్గంగా నేనూ, పూసపాటి కృష్ణం రాజు (చాలా మంచి స్పార్క్ వున్న రచయిత - ఈనాడు ఆయన స్మృతిగా మిగిలిపోయాడు) మరో వెర్షన్ తయారుచేసేవాళ్ళం. ఆత్రేయ వచ్చి అది చూసి దానిపై తన ధోరణిలో మార్పు చేసి రాసేవారు.

ఒకసారి "మనసివ్వలేని మగనితో మగువలెప్పుడూ కన్నీటి కాపురం చెయ్యలేరు గాక చెయ్యలేరు" అని రాశాడు. "ఏమిటీ యతి ప్రాసలు" అన్నాను. "పాటలకే కాదు....మాటలకీ అవసరమే. విషయం లేనప్పుడు చప్పుడు అవసరం" అన్నాడు.

అటు తర్వాత పాటల రచన మీదనే కృషి చేయమని తన చిత్రాలకు రాసే అవకాశం కల్పిస్తానని స్థిరంగా వుంటేనే దేనికైనా ఫలం వుంటుందని ఆయన మాటల్లో...(యుహేవ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, డోంట్ వర్రీ, థింగ్స్ విల్ కం టు యు) ఆయన నచ్చచెప్పడం జరిగింది. ఒకటి రెండు అనుభవాలు నాకు రుచించలేదు. ఒక నిర్మాత ఆయన ఎదురుగా అతి వినయంగా "తప్పకుండా సార్" అని నన్ను ఆఫీసుకు రమ్మని "మాకు మొదటినుంచీ రైటర్ ఆరుద్రగారు సార్. మాకు సెంటిమెంటు కూడాను" అంటూ వాపోవడం జరిగింది. "అందులో తప్పేముంది. సెంటిమెంటును నేనూ గౌరవిస్తాను" అని వచ్చేశాను. ఇవి నేను ఎదురుచూడని అనుభవాలు. జర్నలిజంలో నాకు సదవకాశాలెన్నో వుండగా నేనెందుకు ఇలా బాధపడాలి" అనుకుని ఆ రాత్రే రైలెక్కి విజయవాడ చేరి "ఆంధ్రప్రభ" లో చేరాను. నేను రామారావుగారితో చెప్పకుండా, చెబితే వెళ్ళనివ్వరని, వచ్చేశాను.

ఆ తరువాత హైదరాబాదులో ఫతే మైదానంలో లాల్ బహదూర్ శాస్త్రి గారికి దేశరక్షణ నిధి అందజేయడానికి రామారావుగారు రావడం, ఆ సభను కవర్ చేయడానికి పత్రికా విలేఖరిగా వచ్చిన నన్ను చూసి కొపంగా స్టేజి మీదికి పిలిపించి "ఎందుకిలా చేశారు! ఇదేమీ బాగాలేదు, మద్రాసు బయలుదేరండి" అని ఆజ్ఞాపించారు. "నేను వస్తానులెండి. తరువాత మీతో మాట్లాడతానుగా" అన్నాను. "అన్నీ నాకు తెలుసు. మీరేం చెప్పనక్కరలేదు. పేషన్స్ వుండాలి - నాకు మద్రాసు వచ్చి కనిపించండి" అన్నారు.

ఎందుకంతగా ఆయన నన్ను రచయితగా చూడాలనుకున్నారో తెలియదు కాని, నేను రచయితగా రామారావు గారికి రాసిన పాటలు రాశి లాభాలు కలబోసి వాసిగన్నవై నిలిచాయి.

***

నేను సినీరంగంలో రచయితను కావాలని నా జర్నలిజం రోజులలోనే నన్ను ప్రోత్సహించిన వారు ఎన్.టి.ఆర్. నిర్నామకర్మగా తొలుత ప్రారంభించిన ఆ వ్యాసంగం విశ్వనాథుడి ఆశీస్సులతో, అండతో వెలుగు చూసింది. ఇహపరాలకు విశ్వనాథుడు వృత్తిమార్గం చూపితే వాణిపరంగాను, వాణిజ్యపరంగాను ఎన్.టి.ఆర్ చిత్రాలు నాకు చేయూతనిచ్చాయి. ఏ భిన్నధ్రువాల మధ్య భువనమై ఒదిగి గగనమై ఎదిగింది నా సినీసాహితీ జీవితం.

"దస్తూరి గుణాల కస్తూరి" అనే వాక్యం రమణాత్మకం. రమణగారు పదే పదే అనేవారు. ఎన్.టి.ఆర్ దస్తూరి చూస్తే "ఆంధ్రాక్షరంబులు మురుపులొలుకు గుండ్ర ముత్తియములు" అన్న మాట కన్నుల కట్టినట్లు వుండేది. ఆయన తీసిన చాలా పౌరాణిక చిత్రాల "స్క్రిప్టు" గ్రంధాలు ఆయనే స్వయంగా, ప్రియంగా రాసుకుని బైండు చేయించుకుని పెట్టుకునేవారు. వృత్తిమీద, ప్రవృత్తి మీద అటువంటి క్రమశిక్షణ సాధించిన కళకారులు అరుదు.

ఒకసారి ఆయన అలా రాసుకున్న స్క్రిప్టులో "నిర్విక్రపరాక్రమం" అనే నెరసు దొర్లింది. "ఇక్కడ తప్పుంది. దీనిని నిర్వక్ర అని మార్చాలి" అన్నాను. దానికి ఆయన చకితులై "అది సముద్రాల గారు రాసింది - అందులో తప్పెలా వుంటుంది?" అన్నారు. "ప్రమాదో ధీమతామపి" అన్నారు కదా అలా జరిగిందేమో అన్నాను. ఆయన ఎక్కడో ఆలోచిస్తూ ఒక్కొక్కప్పుడు మాట్లాడేవారు. "కాపీ చేయడంలో కూడా తప్పు జరిగే అవకాశం వుంది" అన్నాను. వెంటనే మూల ప్రతి తెప్పించి చూశారు. అందులోనూ అలాగే వుంది. "అయితే ఆచార్యులవారు చెబితే రాసినవారు - లేఖకులు - చేసిన పొరబాటు ఇది" అన్నాను. "కాదు అది రైటే" అన్నారు రామారావుగారు. ఇక లాగడం మంచిది కాదని మౌనం వహించాను. ఆయనకు ఎవరియందైనా గురి ఏర్పడితే అంతే! దానిని ఎవరూ చెదరగొట్టలేరు.

"అడవిరాముడు" చిత్రంలో తొలిసారి నేను ఆయనకు పాటలు రాశాను. అంతకు ముందు "సిరిసిరి మువ్వ" చిత్రంలో పాటలు... ముఖ్యంగా "రా దిగిరా దివినించి భువికి దిగిరా" అన్న పాటను విని ఆయన మా గురువు విశ్వనాథ్ గారితో తన ఆనందం వెల్లడించారట.

ఘంటసాల నా పాట ఒక్కటికూడా పాడకపోవడం నా జీవితానికి పెద్ద లోటుగా భావిస్తాను. "దీక్ష (కోగంటి కుటుంబరావు - ప్రత్యగాత్మ)" చిత్రంలో తనకు, జమునకు భామాకృష్ణులుగా ఒక పాట వుంటే అది కలర్ లో తీస్తే బాగుంటుందని రామారావుగారు భావించారు. అప్పటికే ఆ చిత్రం పూర్తి కావచ్చింది. అది నిర్మాతకు అదనపు భారం. అయినా అది వుంటే చిత్ర విజయానికి మరింత దోహదం అవుతుందని ఎన్.టీ.ఆర్ భావించి 1971 సంక్రాంతి నాడు ఆ పాట నా చేతనే రాయించారు.

ఆ క్రితం రోజు భోగిపండుగ నాడు ప్రాతఃకాలంలో పూజ చేసి హారతి పళ్లెంలో 501 రూపాయలు పెట్టి తొలి సినిమా పాట అడ్వాన్సుగా నాకు తమ చేతుల మీదుగా ఇచ్చిన శ్రీ కోగంటి దంపతులను నేను మర్చిపోలేను. పాట రాయడం, పెండ్యాలగారు తిలక్ కామోద్ రాగంలో ప్రారంభించి రాగమాలికగా దానిని ట్యూను చేయడం కూడా జరిగాయి. అది ఘంటసాల, సుశీల పాడవలసిన ఒక గేయ రూపకం.

"నిన్న రాతిరి కలలో
సన్న చేసి సరసకు రమ్మని
నిన్ను పిలిచిన దెవరే చెలియా
వేయి పేరుల వాడే - వాడు
వేల వేల తీరుల వాడే - పదా
ర్వేల నారుల రేడే..."

ఇలా సాగే ఆ రచనని తన వద్దకు వచ్చిన నిర్మాతలకి చదివి వినిపించి రామారావుగారు ఎంతగా మురిసి పోయారో! అప్పుడు అది విన్న వారిలో దేవీవరప్రసాద్ గారు, వై.వి.రావుగారు, కొండవీటి వెంకటకవి గారు ఉన్నారు.

అటు తర్వాత చాలా కాలానికి "విరాట పర్వం" తీస్తూ బృహన్నల నాట్యాచార్యుడుగా ఉత్తరను తీర్చిదిద్ది తొలి నాట్యం చేయించే సందర్భంలో నేను పాట రాసి యిస్తే అది చూసి పక్కనే వున్న వెంకటకవి గారికి ఇచ్చారు.

"ఆడవే హంసగమన - నడ
యాడవే ఇందువదన"

అనే పల్లవి చూసి కవిగారు "హంసగమనా ఆడవే అన్నారు హంస నాట్యానికి ప్రసిద్ధి కాదుకదా" అని అడిగారు. వెంటనే నేను "అక్కడ మాట అంటున్నది పేడి అయిన బృహన్నల కాదు - అతనిలో దాగి వున్న నాట్య కోవిదుడైన అర్జునుడు - అతను హంసలను నెమళ్ళను కాక అంతకన్న ఉదాత్తమైన తన స్థాయికి తగిన ఉపమానోపమేయాలు తేవాలి కడ - అందుకే ఇక్కడ ' హంస ' శబ్దం సూర్యపరంగా వాడాను. క్రమం తప్పని గమనంలో సూర్యుడంతటి సమగమనం కలదానా అని అర్థం. అక్కడ "హంస సూర్యపరంగా వాడాను కాబట్టే ' నడయాడవే ఇందువదన ' అనడం - గమనశ్రమ ఎంత కలిగినా ఆహ్లాదకరమైన చంద్రుడి వదనమే కలదానా అనే అర్థంలో చెప్పడం జరిగింది" అన్నాను.

వెంకటకవిగారు ఆశువుగా ఏదో పద్యపాదం చదివి లేచి నన్ను కౌగిలించుకున్నారు. నా విషయంలో రామారావుగారు ఆనాడు ఎంత తృప్తి వెల్లడించారో అక్కడే వున్న సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తిగారు పదే పదే చాలాకాలంగా ఆ సంఘటనే ప్రస్తావించేవారు. అదే చిత్రంలో "జీవితమే కృష్ణ సంగీతము" అనే గీతం కూడా రామారావుగారు స్వగతంగా పాడుకుంటూ వుండేవారు. ఈ రెండు పాటలూ అన్నగారు బాలమురళిగారు పాడడంతో వాటికి మరింత వన్నె పెరిగింది.

"అడవిరాముడు" చిత్రంలో రామారావుగారి నోట నా పాట తొలిసారిగా తెలుగు ప్రేక్షక శ్రోతలకు వినపడింది. "కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు - తరతరాలకీ తరగని వెలుగౌతారు - ఇలవేలుపులౌతారు" - ఏ ప్రేరణ, ఏ శక్తి నా చేత ఈ పదాలు రాయించిందో అవి చరిత్రగా మారిపోవడం దైవికం. తెలుగుపాట కోటిరూపాయల పాట కావడం కూడా ఆ చిత్రంలోని "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" అనే పాటతోనే జరిగింది. పాట చిత్రీకరణలో "కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి - చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి" అత్యున్నతస్థాయి సాధించింది.వీటన్నిటికీ వెనకనున్న శక్తి, వ్యక్తి శ్రీ రాఘవేంద్రరావు.

రామారావుగారు ఆదర్శ విద్యార్థిగా, అందగాడుగా, అందమైన ఆకర్షణీయమైన మందహాసంలా, మధుమాసంలా, సన్నజాజుల నవ్వులతో సన్నగా పొడుగ్గా, వినయ విధేయతల తలమానికంలా వున్న రోజులు "మనదేశం" నాటివి. రాయలసీమ కరువు సహాయ ప్రదర్శనల కాలానికి కొంచెం గడిచేరిన రామారావు వ్యక్తిత్వం, మాయాబజార్ నాటికి ధీర గంభీరముద్ర దాల్చింది.అటు తర్వాత ఎక్కువగా పౌరాణిక పాత్రల ధోరణిలో అది మరింత "ముదిరి" మేరునగ ధీరత్వానికి రూపు దిద్దింది.

ఒకసారి "అగ్గిరాముడు" శతదినోత్సవం విజయవాడ సరస్వతీ టాకీస్ లో జరిగినప్పుడు ఎంతో నిరాడంబరంగా జరిగిన ఆ సభకు ఎన్.టీ.ఆర్ వచ్చారు. రేలంగి కూడా (హెడ్ కానిస్టేబుల్ 441) హాజరైన ఆ సభలో రామారావుగారు ప్రసంగిస్తూ తన కాలేజీ రోజులు, విజయవాడ వీధులలో విద్యార్థిగా తిరిగిన నాటి జ్ఞాపకాలతో సహా ఆర్ద్రంగా తలచుకుని కంట తడిపెట్టడం జరిగింది. తన గురువు విశ్వనాథ వారి వ్యక్తిత్వ వైలక్షణ్యాన్ని ఎంతో ముద్దుగా ఆయన ఆ సభలో వివరించడం జనాన్ని ఆకట్టుకుంది. తన ప్రసంగ మధ్యంలో హఠాత్తుగా ఆయన సభామధ్యంలో వున్న ఒక వృద్ధమూర్తిని చూసి వేదిక దిగి సభలోకి వచ్చి ఆయనను సాదరంగా తనతో నడిపించుకుని ముందు వరుసలో కూర్చోబెట్టి పాదాలకు నమస్కరించి తిరిగి తన ప్రసంగం కొనసాగిస్తూ తను స్కూలు విద్యార్థిగా వున్నప్పుడు తనకు ఆంధ్రభాషాభిమానం, భాషా పరిచయం కలగజేసినది ఆ పెద్దాయనే అని వివరించారు.

గత జీవితక్షణాలను ప్రేమతో భక్తితో స్మరించి అభిషేకించిన అరుదైన సినీ పురుషులలో రామారావుగారు ఒకరు. లీలామహల్ వద్ద తిన్న (తనకిష్టమైన) మిరపకాయబజ్జీలు కూడా ఆయన మరువలేదు, విడువలేదు. తన జీవితకాలం పాటు పానం, ధూమపానం బహిష్కరించిన యోగి ఆయన. నటనకోసం కూడా అయిష్టంగానే ఆయన ఆ విషయంలో నటించేవారు. ప్రాణాయామం, యోగాసనాల మీద అత్యంత నియమనిష్ఠలు వుండేవి - "అభ్యంగ మాచరేన్నిత్యం నజరా శ్రమవాతః" అనే చరక సంహితలోని మహాసూక్తి ఆయన పాటించారు. ఏలకులతో, అల్లంతో ఔషధప్రాయంగా తేనీరు సేవించడం ఆయనకిష్టం.

ఒకసారి "అడవిరాముడు" షూటింగ్ లో నా చేతిలో జర్దాకిళ్లీల పొట్లం చూసి "ఏమిటిది బ్రదర్" అని అడిగారు. ఉన్న విషయం చెప్పాను. "విషం లాంటిదే! ఎందుకు వాడుతున్నారు" ఇదీ ప్రశ్న - నిరుత్తరుణ్ణి అయ్యాను. వెంటనే "ఏదీ" అని అడిగి తీసుకుని కిళ్ళీ విప్పి చూసి, వాసన చూసి సువాసనకు కనుబొమలెగరవేసి "ఇంకొంచెం జర్దా వేయించండి" అని అడిగి వేయించుకుని కిళ్ళీగా మడిచి నోట్లో వేసుకున్నారు! అందరూ గాభరా పడిపొయారు. "చెమటలు పట్టి, వాంతులైతే ఇంకేమన్నా వుందా! అసలే అలవాటు లేని మనిషాయే" అని గుసగుసలు కలకలాత్మకంగా మొదలైనాయి. పైగా "ఆయన మింగారో ఏమో" అని కొందరు భయపడ్డారు. సరిగ్గా అదే పని చేశారు రామారావుగారు.

అప్పుడే "షాట్ రెడీ" అని పిలుపు, నోట్లోది తాపీగా ఉమ్మి, కడుక్కుని మామూలుగా షాట్ లో అభినయం చేసి వెళ్ళి కూర్చున్నారు. అందరికీ అమితాశ్చర్యం వేసింది. శరీరాన్ని అంత అదుపులో వుంచుకున్న నటుడు మరొకరు లేరు. అప్పుడప్పుడు అలా అందరినీ ఆశ్చర్యపరచడం, దైహిక క్రమశిక్షణను గురించి చెప్పకుండా చెప్పడం ఆయన హాబీ.

అయ్యప్ప దీక్ష నియమనిష్ఠలు తు.చ. తప్పకుండా మండలంపాటు పాటించేవారంటే ఆయనకు చాలా గౌరవం వుండేది. ఆత్మశుద్ధికీ శరీరక్షాళనకు ఇది సినిమా జీవులకు చాలా అవసరమని నేను దీక్ష తీసుకున్నప్పుడు ఆయన అన్నారు. అయితే సామూహికంగా పాటించే దీక్షను ఆయన స్వీకరించినట్లు లేదు.

జాతి సంస్కృతికి మూలాధారాలైన కళలను ఉపాసించి ఉపాధిగా చేసుకోదలచిన వారికి శ్రీ నందమూరి తారకరామారావు జీవితం మార్గదర్శకమని చెప్పక తప్పదు. భాషతోను, పురాణేతిహాసాలతోను సమగ్రమైన పరిచయం, పాండిత్యాలుండాలని ఆయన జీవితం చేసే మౌనోపదేశం విన్న వాడే నిజమైన వేదాంతుడు కాగలడని నా విశ్వాసం. చరిత్ర పరిజ్ఞానం రామారావుగారి చేత ఎన్నో గొప్ప చిత్రాలు తీయించింది. ఆయనలోని వైరాగ్య సంపత్తి వీరబ్రహ్మేంద్ర చరిత్ర తీయిస్తే సాహితీ పురుషాభిమానం పండిన వయః పరిపాకంలో, పదవిళొ వున్నా శ్రీనాథ చిత్రాన్ని తెరకెక్కించింది.

కొందరు గొప్ప వ్యక్తులు వెళ్ళిపోతూ కొన్ని మధుర స్మృతులను ఆర్ద్ర సంఘటనలను, మరపురాని క్షణాలను మిగిల్చిపొతారు.

ఒకానొక ఉగాదినాడు నంది అవార్డ్ అందుకోవడానికి వచ్చిన నన్ను దూరం నుంచే చూసి దగ్గరకు వచ్చి కరచాలనం చేస్తూ "మీ పాటలు మా నోట పలకడం లేదే! మా పాట మాదైపోయిందే" అన్న రామారావుగారిని నేను మరువలేను. మరొక్క సందర్భంలో "తెలుగు అంతరాత్మని మేలు కొలపండి. సినిమా పాటల్లో ఇవి కూడా వచ్చేట్టు చూడండి. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే పాటలు ఈనాడు ఎంతో అవసరం" అన్నారు.

నాకు జాతీయ పురస్కారం లభించినప్పుడు జరిగిన సభలో ఆరోగ్యం బాగా లేకున్నా ఆద్యంతము వుండి ఆశీర్వదించిన ఆయనను ఎలా మరిచిపోగలను!

ఆదర్శ కళాకారుడు, ఆంధ్రజాతి అంతరాత్మకు సాక్షి శ్రీ రామారావుగారు. ఆయనకు ఇదే నా అక్షరాంజలి.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration