Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6517
Registered: 03-2004
Posted From: 76.122.132.110

Rating: N/A
Votes: 0

Posted on Sunday, October 06, 2013 - 12:06 am:   

http://www.andhrajyothy.com/node/7532

ఇకపై రాష్ట్రంలో ఏమి జరిగినా అందుకు సోనియాగాంధీ అండ్ కోనే బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. ప్రజల ఆకాంక్షలతో నిమిత్తం లేకుండా పది, పదిహేను లోక్‌సభ సీట్లను వచ్చే ఎన్నికలలో పొందడం కోసం హడావుడిగా ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. ఆ తర్వాత 2019లో జరిగే ఎన్నికలలో ప్రయోజనం కోసం మరో రాష్ట్రాన్ని విభజిస్తారా? రాజకీయాలు ఇంతగా దిగజారిన తర్వాత ప్రజలలో చైతన్యం రావడం ఒక్కటే సమస్యకు పరిష్కారం. ఈ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా రాష్ట్ర విభజనను పూర్తిచేస్తే దీర్ఘకాలంలో అది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి కూడా ఆమోద ముద్ర వేయడంతో విభజన ప్రక్రియ ఇక వేగవంతం అవుతుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమని కాకుండా, రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు కనుక 2014 ఎన్నికలలోపే విభజన ప్రక్రియ పూర్తి అవుతుంది. అలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఆశించిన ప్రయోజనం నెరవేరదు గనుక, మరో రెండు మూడు నెలల్లో రాష్ట్ర విభజన తథ్యం! తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కావాలని గొంతు చించుకున్నా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు విభజన వద్దని సీమాంధ్రులు అరచి గోలపెడుతున్నా ఆగడం లేదంటేనే ఈ వ్యవహారంలో ఏదో మతలబు ఉందని అర్థం అవుతోంది. విభజనను ఆపడానికి సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు కొంతమంది గట్టి ప్రయత్నాలు చేయగా, మరికొంత మంది ప్రయత్నించినట్టు నటించారు.
ఇంకొందరు సహకరించారు. దీంతో సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు ఒకరినొకరు నమ్మలేని స్థితిలో ఉన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడం ఎలా అని సమావేశాలు నిర్వహించుకుంటున్నా, అందులో పాల్గొంటున్న వారిలో కోవర్టులు ఉన్నారేమోనని పరస్పరం అనుమానంతో చూసుకుంటున్నారు. తామెంత గోల చేసినా విభజన ఆగదని గ్రహించిన కాంగ్రెస్ ముఖ్యులు తమ దారి తాము చూసుకుంటున్నారు. మొత్తంమీద సీమాంధ్రలో కాంగ్రెస్ దుకాణం త్వరలోనే మూతపడబోతున్నది. అయినా కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు భయపడటం లేదంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో వారికి ఒక ఆపద్బాంధవుడు కనిపిస్తున్నాడు. పరాయి పార్టీని నమ్ముకుని సొంత పార్టీ వాళ్ల గొంతులు కోయడానికి సిద్ధపడిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌లోని ఒక వర్గం పట్టుదలగా ఉంది.
జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తిని చేరదీయడం ఆత్మహత్యాసదృశమని నిన్నటి వరకు భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం అంతలోనే మనస్సు మార్చుకోవడానికి కారణం ఏమిటి? 2014 ఎన్నికలలో దేశవ్యాప్తంగా పరిస్థితులు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా ఉన్నాయనీ, నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఏర్పడితే కనీసం పదేళ్లపాటు అధికారంలో కొనసాగుతుందనీ, తమకు కష్టాలు తప్పవని కాంగ్రెస్ పెద్దలలో గుబులు ఏర్పడటంతో అభిప్రాయాలు, నిర్ణయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మోదీ ప్రభుత్వం ఏర్పడితే తాము జైలుకు వెళ్లవలసిన పరిస్థితి ఎదురవుతుందని అహ్మద్ పటేల్, చిదంబరం వంటి వారు కూడా భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో శివగంగ నుంచి పోటీ చేసి గెలవలేనన్న భయంతో ఉన్న చిదంబరం, మన రాష్ట్రంలోని మెదక్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారనీ, ఇందుకోసమై ఆయన ఇటీవలి కాలంలో విజయశాంతిని పిలిపించుకుని పలు దఫాలు చర్చించారని చెబుతున్నారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి విజయ మాల్యాకు 300 కోట్ల రూపాయల రుణం ఇప్పించిన వ్యవహారంలో చిదంబరం చిక్కుకున్నారు. చిరు వ్యాపారులకు మాత్రమే రుణాలు ఇచ్చే ఈ బ్యాంకుతో విజయ మాల్యాకు భారీ రుణం మంజూరు చేయించింది చిదంబరమేనని ఆ బ్యాంకు సి.ఎం.డి. విచారణ సంస్థకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ రుణ వ్యవహారంపై ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచారణ జరుపుతున్నది. లోక్‌సభలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శివగంగ నియోజకవర్గంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను ప్రారంభింపజేయడానికి ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చిదంబరానికి చెందిన సొంత ఫంక్షన్ హాలును అద్దెకు తీసుకుని, ఆ హాలును అందంగా తీర్చిదిద్దడానికి 80 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీనిపై కూడా రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదులు వెళ్లడం, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఈ వ్యవహారం తెలియడంతో చిదంబరంలో ఆందోళన మొదలైంది. గత ఎన్నికలలో ఓడిపోయినా విజయం సాధించిన ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. అభ్యర్థిని లొంగదీసుకుని, రీకౌంటింగ్ పేరిట గెలిచినట్టు ప్రకటింపజేసుకున్న చిదంబరంపై జయలలిత అప్పటి నుంచీ కత్తులు నూరుతున్నారు.
దీంతో సురక్షిత స్థానం కోసం వెదుకుతున్న చిదంబరానికి తెలంగాణ అంశం కనిపించిందని చెబుతున్నారు. తెలంగాణపై తేల్చకపోతే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం కూడా లభించదనీ, మోదీ అధికారంలోకి వస్తే మనం అందరం చిక్కుల్లో పడతామని సోనియాగాంధీని చిదంబరం ప్రభృతులు భయపెట్టారు. దీంతో విభజనకు రంగం సిద్ధమవ్వడంతో పాటు, జగన్మోహన్‌రెడ్డితో డీల్ కుదుర్చుకోవాలన్న నిర్ణయానికీ కాంగ్రెస్ అధిష్ఠానం వచ్చింది. అప్పటికే బెయిల్ కోసం అల్లాడుతున్న జగన్‌కు ఇది అందివచ్చిన అవకాశం. బెయిల్ డీల్ కుదరబోతోందన్న విషయం వై.సి.పి. నాయకులలో ముఖ్యులకు తెలిసిపోయింది. అక్టోబర్ నాలుగవ తేదీన జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తారని బెయిల్ రావడానికి ముందే మాజీ ఎంపీ బాలశౌరి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి, జగన్‌కు మధ్య అవగాహన కుదిరిన విషయం తెలిశాకే బాలశౌరి వై.సి.పి.లో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్‌తో డీల్ కుదరక ముందు కొండా సురేఖ దంపతులను జైలుకు పిలిపించుకుని నచ్చజెప్పిన జగన్, డీల్ కుదిరిన తర్వాత వారిని పట్టించుకోవడం మానేశారు. తెలంగాణపై పాత విధానానికే కట్టుబడి ఉంటామని చెప్పినా చాలు.. పార్టీలోనే కొనసాగుతామని కె.కె.మహేందర్ రెడ్డి, కొండా సురేఖ వంటి వారు సూచించినా, "బెస్టాఫ్ లక్'' అంటూ వారిని పార్టీ నుంచి పంపివేశారు.
అంటే అప్పటికే తెలంగాణలో పార్టీని వదులుకుని సీమాంధ్రకే పరిమితం కావాలని జగన్ నిర్ణయించుకున్నారన్న మాట! బెయిల్ రావడానికి కొద్ది రోజుల ముందు ఇదంతా జరిగింది. కాంగ్రెస్ అధిష్ఠానం- జగన్ మధ్య డీల్ కుదరడంతో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితిని కలుపుకోవడం ద్వారా తెలంగాణలో, జగన్మోహన్ రెడ్డి రూపంలో సీమాంధ్రలో ప్రయోజనం పొందవచ్చునని కాంగ్రెస్ పెద్దలు వ్యూహరచన చేశారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు ఉద్యమిస్తున్నా, కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటని ఆరా తీసిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. తమ రాజకీయ భవిష్యత్తును బలిపెట్టి జగన్‌పై ఆధారపడటాన్ని కొంత మంది ఎంపీలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో వారు ఎంపీ పదవులతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నారు.
కోవర్టు రాజకీయం!
రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రారంభించిన సోనియాగాంధీ సీమాంధ్ర విషయంలో వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని హేతుబద్ధంగా మాట్లాడే తెలంగాణవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు. కేబినెట్ నోట్ రూపకల్పనకే 60 రోజులు తీసుకున్నవాళ్లు ఉభయ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి, పంపకాల విషయం తేల్చడానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘానికి 45 రోజుల గడువు మాత్రమే ఇవ్వడం దారుణమనే చెప్పాలి. ఒక ప్రాంత ప్రయోజనాల విషయంలో ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటే వారిని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక రాజకీయ పార్టీ, అందునా 125 ఏళ్లకు పైబడి చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్ చేయవలసిన పనేనా ఇది? తెలంగాణను కోరుకుంటున్నవారు కూడా సీమాంధ్ర సమస్యలు పరిష్కరించి విభజనను సాఫీగా పూర్తిచేయాలని భావిస్తున్నారు. సోనియాగాంధీ బృందానికి ఈ మాత్రం ఇంగితం లేకపోవడానికి కారణం ఏమిటి? రాష్ట్ర కాంగ్రెస్‌లో కొంత మంది కోవర్టులు ఉండటం కూడా సీమాంధ్ర ఉద్యమాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోకపోవడానికి కారణం. స్కూలు పిల్లలను తీసుకువచ్చి ఉద్యమంగా చూపిస్తున్నారనీ, ఉద్యోగులు, స్కూలు పిల్లలు లేకపోతే సీమాంధ్రలో ఉద్యమం లేదని సీమాంధ్రకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులే అధిష్ఠానానికి చెప్పారు. ఈ కారణంతో పాటు జగన్‌తో డీల్ కుదిరినందున సీమాంధ్రులను పట్టించుకోవలసిన అవసరం లేదన్న నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్ఠానం వచ్చింది.
రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించిన నాటి నుంచి ఇప్పటివరకు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన చర్చలు, కోవర్టు ఆపరేషన్లు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. జగన్‌తో డీల్ కుదిరిన విషయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు కె.వి.పి.రామచంద్రరావుకు కూడా ముందే తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సాక్షి మీడియాలో పనిచేస్తున్న రామిరెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎంపిక చేయాలని సాక్షాత్తూ సోనియాగాంధీనే ముఖ్యమంత్రికి సూచించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కక్షగట్టి వార్తలు ప్రచురిస్తున్న జగన్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తికి టికెట్ ఇస్తే ప్రజలు అపార్థం చేసుకుంటారని సోనియాగాంధీకి ముఖ్యమంత్రి నచ్చజెప్పారు. అప్పటి నుంచే జగన్, కాంగ్రెస్‌కు మధ్య ఏదో జరుగుతోందని ముఖ్యమంత్రి వర్గం అనుమానించడం ప్రారంభించింది. అయితే తనను కాదని అధిష్ఠానం నిర్ణయం తీసుకోదన్న భరోసాతో ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి, ఆ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు తన మాటను ఏ మాత్రం లెక్క చేయకుండా రాష్ట్ర విభజనకు పార్టీ పెద్దలు నిర్ణయించడంతో కిరణ్‌కుమార్ రెడ్డి కక్క లేక మింగలేక ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రికి కూడా సానుకూల దృక్పథమే ఉందని చెప్పే సంఘటన ఇటీవల ఒకటి జరిగింది. జగన్‌ను నమ్మి పార్టీ పెద్దలు మా గొంతులు కోశారని విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసినప్పుడు "ఎందుకు తొందరపడుతున్నావు.
ఇలాంటి ప్రకటనలు చేస్తే జగన్ పార్టీలోకి వెళ్లడానికి నీకు దారులు మూసుకుపోతాయి'' అని కిరణ్ అనడంతో సదరు ఎమ్మెల్యే నివ్వెరపోయారు. ఇలాంటివి మరికొన్ని సంఘటనలు జరగడంతో ముఖ్యమంత్రిని నమ్మడానికి మంత్రులు, శాసనసభ్యులు వెనుకాడుతున్నారు. అదే సమయంలో ఏ మంత్రిని నమ్మాలో తెలియడం లేదని ముఖ్యమంత్రి వాపోతున్నారు. ముఖ్యమంత్రి వద్ద జరుగుతున్న సమావేశాలలో ఎవరికి తోచిన రీతిలో వారు నటిస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు అంతకంటే ఎక్కువగా నటిస్తున్నారు. గత రెండు మాసాలుగా జరుగుతున్న వ్యవహారాలలో కె.వి.పి.రామచంద్రరావు కోవర్టుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయానికి అధిష్ఠానంపై ఆగ్రహంగా ఉన్న ఎంపీలు వచ్చారు. కె.వి.పి. సమక్షంలో తాము మాట్లాడుకున్న విషయాలు పార్టీ అధిష్ఠానం పెద్దలకు వెంటనే తెలిసిపోతున్నాయని వారు గుర్తించారు. "కాంగ్రెస్ పార్టీ మనల్ని ముంచేసింది. ఇప్పుడు మన భవిష్యత్తు కోసం సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుందాం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నారు'' అని కొంతమంది ఎంపీలు కె.వి.పి. కూడా పాల్గొన్న సమావేశంలో ప్రస్తావించారు. ఇది జరిగిన రెండు రోజులకే విషయం అధిష్ఠానానికి తెలిసింది.
తనను కలిసిన ఒక ఎంపీ వద్ద "ఏంటి మీరంతా కొత్త పార్టీ పెట్టుకుంటున్నారట కదా? అయినా మీరందరూ కలిసినా జగన్మోహన్‌రెడ్డిని ఓడించలేరు. సీమాంధ్రలో ఆయన స్వీప్ చేస్తారు'' అని అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. దీంతో తమ మధ్య జరిగిన సంభాషణలను కె.వి.పి.నే లీక్ చేస్తున్నారని సదరు ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. పదవులకు రాజీనామాలు చేసే విషయంలో కూడా కొంత మంది ఎంపీలను కె.వి.పి. నివారించారట! రాజీనామాల వ్యవహారంలో ఎంపీల మధ్య కూడా ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదవులకు రాజీనామాలు చేస్తున్నామని తొలుత ప్రకటించిన పలువురు ఎంపీలు ఆ తర్వాత జారుకున్నారు. రాయపాటి సాంబశివరావు వ్యవహారమే ఇందుకు నిదర్శనం. విభజన ప్రకటన వెలువడిన రోజే అమెరికా నుంచి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రాయపాటి, తీరా స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి రాజీనామాలు ఆమోదింపజేసుకోవడానికి రావలసిందిగా సహచర ఎంపీలు కోరినప్పుడు ముఖం చాటేశారు. కేంద్ర మంత్రుల వ్యవహారం కూడా దాగుడుమూతలుగానే ఉంది. తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన తర్వాత ప్రజాగ్రహాన్ని తప్పించుకోవడానికి రాజీనామాలు ప్రకటించిన వారు నిజంగా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరు.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఒక్కరే ప్రధానమంత్రిని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. మిగతావారంతా ఉత్తుత్తి రాజీనామాలు ప్రకటించారు. మొత్తంమీద డ్రామాలు, నాటకీయ పరిణామాలతో వ్యవహారం మూడు రాజీనామాలు, ఆరు ఉపసంహరణలుగా సాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం తమకు పూచిక పుల్లకు ఇచ్చినంత గౌరవం కూడా ఇవ్వడం లేదనీ, మీరందరూ పోయినా పర్వాలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చాలు అన్నట్టుగా వ్యవహరిస్తోందని ఒక ఎంపీ ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తంమీద సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నిర్వేదంలో ఉన్నారు. మనస్సులోని అభిప్రాయాలు చెప్పుకోవడానికి కూడా నమ్మకమైన మిత్రులు లేక అల్లాడుతున్నారు. ఎవరు అధిష్ఠానం మనిషో, ఎవరు కాదో తెలుసుకోవడం కష్టంగా ఉంది అని ఒక మంత్రి వాపోయారు. అందరం కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకుందామని పైకి చెబుతున్నాం గానీ, లోలోపల ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు అని మరో మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ పార్టీలోకి వెళ్లడానికి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిసి నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి ముందుగానే జగన్‌ను కలిసి కర్చీఫ్ వేసుకున్నారు. తాను పార్టీని వీడుతున్నట్టు ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసి మరీ చెప్పి వెళ్లారు.
మారుతున్న రాజకీయ రంగులు!
జగన్‌తో చేతులు కలపలేక, కాంగ్రెస్‌లో కొనసాగలేని పరిస్థితిలో ఉన్నవారు ముఖ్యమంత్రి వైపు ఆశగా చూస్తున్నారు. ఆయన నేతృత్వంలో సమైక్యాంధ్ర పార్టీ పెట్టాలని చూస్తున్నారు. అయితే కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం తొందరపడవద్దు, డిసెంబర్ వరకు ఆగుదామని సూచిస్తున్నారు. అయితే అంతవరకు ఆగినా ముఖ్యమంత్రి ముందుకు వస్తారా? లేక తమను ముంచేస్తారా? అని ఈ వర్గం ఆవేదన చెందుతోంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోని పక్షంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తొందరలోనే ఖాళీ అవుతుందనీ, అప్పుడు కొత్త పార్టీ పెట్టుకున్నా కలిసి నడవడానికి ఎవరూ మిగలరని వారు కంగారుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో కుల సమీకరణాలు కూడా మారుతున్నాయి. రెడ్లు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నందున కాపులు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో రెడ్ల ప్రాబల్యం పోయి అధికారం తమకు దక్కుతుందని కాపు నాయకులు భావించారు. అయితే విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తున్నందున ఆ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదనీ, మిగిలిన ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీయేనని కాపు నాయకులు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌లో ఉన్న పలువురు కాపు శాసనసభ్యులు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లినవారే! జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళితే ఆత్మగౌరవం ఉండదనీ, తమకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీనే బెటర్ అని వారు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు.
ఇదే జరిగితే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుంది. వచ్చే ఎన్నికలు జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యనే జరగబోతున్నాయి. బెయిల్ కోసం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌తో డీల్ కుదుర్చుకున్నారన్న అభిప్రాయం జనంలోకి విస్తృతంగా వెళ్లింది. దీని ప్రభావం వై.సి.పి.పై ఎంత ఉంటుందనేది మరికొన్ని రోజులు గడిస్తే కానీ తెలియదు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలపై కోపంగా ఉన్నారు. ఈ కారణంగానే సమైక్యవాదం జపిస్తున్నా జగన్‌కు ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. ప్రజల్లో ఆగ్రహావేశాలు చల్లారి వాస్తవంలోకి వచ్చిన తర్వాతే ఏ పార్టీ పరిస్థితి ఏమిటన్నది స్పష్టమవుతుంది. వచ్చే జనవరి నాటికి రాష్ట్ర విభజన పూర్తి అయితే, సమైక్యవాదాన్ని వదిలిపెట్టి తమ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయగలరా? అన్న అంశంపైకి జనం దృష్టి మళ్లుతుంది. ఎన్నికల క్షేత్రంలో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి మిగులుతారు కనుక వారిద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్‌కు రూపురేఖలు ఇవ్వాలంటే అనుభవం ఉన్న చంద్రబాబే అధికారంలోకి రావాలన్న చర్చ జనంలో మొదలైందనీ, ఈ కారణంగానే తాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.
మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండుగా విడిపోయింది. ఒకటి ఢిల్లీ కాంగ్రెస్ అంటే జగన్‌తో అవగాహన కుదుర్చుకున్న అధిష్ఠానంకాగా, రెండవది అంతర్ధానం కాబోతున్న రాష్ట్ర కాంగ్రెస్! 2014 నాటికి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాబోతున్నది. 2014 ఎన్నికలలో లబ్ధి కోసం సొంత పార్టీని త్యాగం చేయడానికి సిద్ధపడిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీమాంధ్ర ప్రజలను శాశ్వతంగా దూరం చేసుకోకూడదనుకుంటే వారి సమస్యలు పరిష్కరించడానికి వెంటనే ప్రయత్నం చేయాలి. సీమాంధ్రులకు న్యాయం చేస్తాం అన్నంత మాత్రాన సరిపోదు. ఏమి న్యాయం చేస్తారు? ఎలా చేస్తారు? వివరించాలి. రాష్ట్రం సోనియాగాంధీ సొంత జాగీరు కాదు. ఇష్టం వచ్చినట్టు చేయడానికి! తెలంగాణ ప్రజలను సంతోషపెట్టడం అంటే సీమాంధ్ర ప్రజలను అవమానించమని అర్థం కాదు గదా! జరిగింది, జరగబోతున్నది తమకు జరుగుతున్న అవమానంగా సీమాంధ్రులు భావిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలను సంతృప్తిపర్చడానికి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకుండా విభజన విషయంలో ముందుకెళ్లడం దేశానికి కూడా మంచిది కాదు. గతంలో తెలంగాణ- ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది.
ఇప్పుడు రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల నాయకులు, ఇతర ప్రముఖుల ప్రమేయం లేకుండా విభజన సందర్భంగా తలెత్తే అంశాలను పరిష్కరిస్తామని చెప్పడం ఏమిటి? తెలుగు ప్రజల జీవితాలతో ఆటలాడుకునే హక్కు సోనియాగాంధీ అండ్ కోకు ఎవరిచ్చారు? ఉభయ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఎవరితో చర్చించి పరిష్కరించబోతున్నారు? ఎన్నికలు తరుముకొస్తున్నాయి. రాజకీయ ప్రయోజనం పొందాలి కనుక ఆదరాబాదరాగా ఏదో చేసేస్తాం అని భావించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత వరకు సమంజసం? వాస్తవానికి తెలంగాణవాదులు కూడా ఘర్షణల మధ్య రాష్ట్ర విభజనను కోరుకోవడం లేదు. రోజులు, నెలల్లో తెలంగాణ కావాలని వారు భావించడం లేదు. ఇంతకాలం నిరీక్షించిన తెలంగాణ ప్రజలు మరికొంత కాలం ఎదురుచూడగలరు. తెలుగు ప్రజల మధ్య శాశ్వత వైషమ్యాలు ఏర్పడకుండా విభజన జరగాలనే అసలైన తెలంగాణవాదులు కోరుకుంటున్నారు. రాష్ట్రం విడిపోతే వెంటనే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వ్యక్తులను మినహాయిస్తే తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రజలతో వైరాన్ని కోరుకోవడం లేదు. ఉభయ ప్రాంతాల మధ్య అత్యంత సంక్లిష్ట అంశాలు ఎన్నో ఉన్నాయి.
అవి పరిష్కారం కావాలంటే ఉభయ ప్రాంతాల నాయకులను లేదా పెద్ద మనుషులను ఒక చోట కూర్చోపెట్టాలి. "ఇవేమీ మాకు పట్టవు. మా ఆలోచనలు మాకు ఉన్నాయి. మా చేతిలో అధికారం ఉంది. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం'' అని అనుకుంటే నిప్పుతో చెలగాటం ఆడటమే అవుతుంది. నూతన రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది నిర్ణయించకుండా రాష్ట్ర విభజన చేయడమంటే సీమాంధ్రలో రాజధాని కోసం తంపులు పెట్టడమే అవుతుంది. విభజన చేస్తామని ప్రకటించడం వరకు ఓకే! ఉభయ ప్రాంతాల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించబోతున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న? ఈ అంశానికి సంబంధించి ఇటు తెలంగాణ నాయకులకు గానీ, అటు సీమాంధ్ర నాయకులకు గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఢిల్లీలో కూర్చుని అంతా నడిపించేస్తాం- మీ చావు మీరు చావండి అన్నట్టుగా వ్యవహరించడం ఏమిటి? తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి అంగీకరించింది కనుక తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు నెరవేరినట్టే! సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డి రూపంలో ప్రయోజనం పొందాలనుకుంటున్నప్పటికీ అక్కడి వారిని ఏదో ఒక విధంగా సంతృప్తిపరచాలి కదా? అది జరగకపోతే కాంగ్రెస్ పార్టీ వేసుకున్న గేమ్ ప్లాన్ బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది.
రాష్ట్రంలో ఉన్నది తమ పార్టీ ప్రభుత్వమే అయినప్పటికీ పరాయి పార్టీ ప్రభుత్వంలాగా కాంగ్రెస్ అధిష్ఠానం పరిగణించడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపించడంతో కాంగ్రెస్ పెద్దలు ఆయనను విశ్వాసంలోకి తీసుకోవడం మానేశారు. అధిష్ఠానం విశ్వసిస్తున్న పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై సీమాంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. నిన్నటివరకు జరిగింది ఒక ఎత్తు. ఇక నుంచి జరగబోతున్నది మరొక ఎత్తుగా ఉండబోతున్నది. ఎన్నికలలో లబ్ధి పొందడానికి సమైక్యవాదం సెంటిమెంట్‌ను ప్రజలలో మరింత రగిలించడానికి వై.సి.పి. రంగంలోకి దిగింది. దీంతో రెండు నెలలుగా ప్రశాంతంగా సాగిన ఉద్యమంలో శుక్ర, శనివారాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. విభజన తీర్మానం శాసనసభ ముందుకు వస్తే దాన్ని ఓడించాలన్న ఆలోచనతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నందున, ఆ పరిస్థితి నివారించడానికై శాంతిభద్రతల పేరిట ప్రభుత్వాన్ని రద్దుచేసే పరిస్థితులు కల్పించబోతున్నారన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. ఇకపై రాష్ట్రంలో ఏమి జరిగినా అందుకు సోనియాగాంధీ అండ్ కోనే బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.
ప్రజల ఆకాంక్షలతో నిమిత్తం లేకుండా పది, పదిహేను లోక్‌సభ సీట్లను వచ్చే ఎన్నికలలో పొందడం కోసం హడావుడిగా ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. ఆ తర్వాత 2019లో జరిగే ఎన్నికలలో ప్రయోజనం కోసం మరో రాష్ట్రాన్ని విభజిస్తారా? రాజకీయాలు ఇంతగా దిగజారిన తర్వాత ప్రజలలో చైతన్యం రావడం ఒక్కటే సమస్యకు పరిష్కారం. ఈ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా రాష్ట్ర విభజనను పూర్తిచేస్తే దీర్ఘకాలంలో అది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. అప్పుడు వాటిని పరిష్కరించడానికి సోనియాగాంధీ అధికారంలో ఉండరు. సీమాంధ్ర ప్రజలు, నాయకులు కూడా వాస్తవంలోకి వచ్చి సమైక్యవాదాన్ని పక్కన పెట్టి తమ హక్కులను కాపాడుకోవడానికి ఇప్పటికైనా ప్రయత్నించని పక్షంలో తర్వాత తీరిగ్గా విచారించవలసి వస్తుంది! -

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration