Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 86590 Registered: 03-2004 Posted From: 130.138.227.10
Rating: N/A Votes: 0 | Posted on Thursday, August 08, 2013 - 10:25 am: | |
హైదరాబాద్: రాష్ట్ర విభజన కారకుల్లో మొట్టమొదట దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉంటారని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఆరోపించారు. విభజనపై కాంగ్రెసు పార్టీ నిర్ణయం అనంతరం తొమ్మిది రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అందరి అభిప్రాయం తర్వాతనే కాంగ్రెసు నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టక ముందే వైయస్ కొంతమందితో సంతకాలు పెట్టించి అధిష్టానానికి పంపించారన్నారు. 2008లో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని చెప్పారు. విగ్రహాల ధ్వంసం సరికాదన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన నెహ్రూ, తెలుగు జాతి కలిసుండాలని కోరిన ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కొన్ని దుష్టశక్తులు ఈ పని చేస్తున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యమం ప్రారంభ దశలో పూర్తి భద్రత కల్పించలేకపోయామన్నారు. ఆంటోనీ కమిటీని హైదరాబాదుకు ఆహ్వానించి అందరి అభిప్రాయాలు తీసుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరు అపోహలు, మనస్థాపాలతో ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. మంచి వర్షాలు పడి రైతుకు ఆశాజనకంగా ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం సరికాదన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. సీమాంధ్రులు రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్ష మేరకే ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నారన్నారు. కలిసి ఉన్న దానికంటే విభజిస్తే ఎక్కువ సమస్యలు వస్తాయన్నారు. దానిని లోతుగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. తాను పార్టీకి నివేదించేందుకే సంతకం పెట్టానని, పార్టీ పరంగా చెప్పుకునే హక్కు తమకుందన్నారు. తాను విభజనకు అనుకూలమో... వ్యతిరేకమో కాదన్నారు. విభజనను మజ్లిస్, సిపిఎం పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయన్నారు. మిగతా అన్ని పార్టీలు అనుకూలంగా నిర్ణయం చెప్పాయన్నారు. అందుకే కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. విభజన ద్వారా తాగు, సాగు, విద్యుత్ తదితర సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని కిరణ్ అన్నారు. ఇప్పటికే ఇన్ని సమస్యలు ఉంటే కొత్తగా మరిన్ని ఇబ్బందులు తెచ్చుకుందామా అని ప్రశ్నించారు. విభజిస్తే వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. నీటి పంపకాలు ఎలా చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. నీటి పంపిణీ విషయంలో అనేక సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. సాగర్ నీటి పంపకాన్ని రైతులకు ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారన్నారు. రెండు ప్రాంతాల మధ్య ఉన్న సాగర్ నీటి పంపకాల విషయంలో స్పష్టత రావాలన్నారు. పోలవరం జాతీయ హోదా వల్ల కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు వస్తాయని, రేపు రెండు రాష్ట్రాలు అయితే ఈ నీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నారు. అంతర్రాష్ట్రాలతో ముడివడి ఉన్న సాగర్ నీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నారు. విభజనతో వచ్చే ఎన్నో సమస్యలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కావేరీ నదీ జలాల వివాదం 1892 నుండి నేటికీ పరిష్కారం కాలేదన్నారు. విద్యుత్ విషయంలో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. పదివేల మెగావాట్ల విద్యుత్‌ను ఎలా తెస్తారో చెప్పాలన్నారు. విభజన జరిగితే తెలంగాణలోనే యాభై శాతం అధికంగా విద్యుత్ కొరత ఏర్పడుతుందన్నారు. విభజన వల్ల ఏర్పడే విద్యుత్ సంక్షోభాన్ని తాను ఆంటోని కమిటీ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. విభజన వల్ల ఇరు ప్రాంతాల రైతులు నష్టపోతారన్నారు. |